ఇంకోసారి ప్యాకేజీస్టార్ అంటే.. చెప్పు తీసి కొడతా: పవన్ కల్యాణ్
వైకాపా నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకపై తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించి హెచ్చరించారు.
మంగళది. వైకాపా నేతలపై జనసేన అదినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకపై తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించి హెచ్చరించారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వైకాపా నేతల వ్యాఖ్యలపై ఆవేశంతో నిప్పులు చెరిగారు.
8 ఏళ్లలో 6 సినిమాలతో రూ.120కోట్లు సంపాదించా
“గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ మాట్లాడుకుందాం. నేను స్కార్పియోలు కొంటే ఎవరిచ్చారని అడిగారు. గత 8 ఏళ్లలో నేను 6 సినిమాలు చేశా. రూ. 100కోట్ల నుంచి రూ. 120కోట్ల ఆదాయం సంపాదించా. రూ.33కోట్లకు పైగా పన్నులు చెల్లించా నా పిల్లల పేరిట ఉన్న పిక్స్డ్ డిపాజిట్లు తీసి పార్టీ కార్యాలయం కోసం ఇచ్చాం. రెండు రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ.12కోట్లు అయోధ్య రామాలయం నిర్మాణం కోసం రూ.30లక్షలు ఇచ్చాను. పార్టీ పెట్టిన నాటి నుంచి బ్యాంకు ఖాతాల్లో రూ.15.58 కోట్ల కార్పస్ ఫండ్ విరాళాలు వచ్చాయి. కౌలు రైతు భరోసా యాత్ర కోసం రూ.3.50కోట్లు వచ్చాయి. ‘నా సేన కోసం నా వంతు’కు రూ. 4కోట్లు అందాయి.